Sunday 6 May 2012

అమ్మ

అమ్మ ............... 
ఒక కమ్మని పిలుపు 
సృష్టిలో ఏ మాటలో లేని తీయదనం ఆ మాటలో వుంది ..
అందుకే ఎవరు ఎన్ని రకాలుగా తెలిపినా ఆమె గొప్పదనాన్ని 
ఇంకా ఎంతో మిగిలే వుంటుంది అమ్మ చూపించే ప్రేమలా........

అవును నేను హేతువాదినే .....కానీ ప్రకృతిని ఆరాధిస్తాను .....కాస్త నమ్మకం కూడా వుంది ...
అమ్మ  .... అనంతమైన  ప్రేమకు నిలయం ...
అలుపెరుగని కరుణ చూపే ఆరాధ్యమైన దేవాలయం ......

ఇలలో కోవెలలో , శిలలో దైవం వుంటే వెలకట్టలేని అమ్మ ప్రేమను ఎలా తాను పంచగలదు............
మహిలో ప్రతిఎదలో ,కనిపించే కనిపెంచే కన్నతల్లి కన్నా కానేకాదు కానరాని ఏ దైవం మిన్న..........

ఊయలలో  ఊహతేలియక  , ఊగిసలాడే సమయంలో 
పాడగలదా ఏ కోయిలయినా , అమ్మ పాడే కమ్మనిపాట .......

మాయలలో , మంచి తెలియక మధనపడే వేళల్లో 
విడువగలరా మనుషులెవ్వరైనా , మన్నించే తల్లి ఒడిని.........

అనంతమైన ఆనందానికి ఆరంభాన్నంధించే , అమృతాన్ని మరిపించే 
నిష్కల్మషమైన , స్వచ్చమైన  అమ్మప్రేమని మరువగలరా.............

మరచిపోతే మరణించినట్లు కాదా.....?  
                                                                                   -Kurella Swamy


Thursday 26 April 2012

మనిషి

నిశ్శబ్ద  తరంగాల వలె మస్తిష్కంలో అలజడులు కలుగుతున్నాయి 

ఈ  రణానికి కారణాలు  తెలియక  కరాలు, చరణాలు గజగజ  వణుకుతున్నాయి 

అస్పష్ట  శబ్దాలు ఏవో అంతరంగాన్ని ఆహ్వానిస్తున్నాయి 

కదలకు , నన్ను వదలి వెళ్ళకు అని ఆయువు మరి మరీ  హెచ్చరిస్తుంది 

దూరంగా ఆ కొండ అంచున  నిలబడి  నీకోసమే నిరీక్షిస్తున్నా  రమ్మని 
 ఏదో ఆకారం సైగ చేస్తుంది 

దారిలో  అడవుందన్న సంగతే మరచి .. అడుగులను వడివడిగా వేస్తుంటే  ఆ చోటు దగ్గరవుతుంది ...... 


.

మధ్యమధ్యలో  అందమైన రూపాలు ఎన్నో తమ కడకు చేరమని అభ్యర్ధిస్తూ , ఆప్యాయంగా పిలుస్తున్నాయి ...

ఎందుకో మరి ... మొదట చూసిన ఆ ఆకారం అంత అందమైనదేమి కానట్టుగా కనిపిస్తున్నా 
ఈ మనిషి  ఎందుకు ఆ సుందరాకారుల  దగ్గర క్షణమైనా నిలబడి ఆలోచించడం లేదు .......

నిజమే మనిషి ఆశాజీవి .... అత్యాశాజీవి .....
అందిన దానిని "ఎందుకని ", అందని దానిని అందుకోవాలని ఆరాటపడే అతిమేదావి .......

కోరుకున్న దానికొరకు కొండలను ఎక్కడానికైనా... కొండమీదనుంచి  దూకడానికి అయినా వెనుకాడని సాహసి...... 

తన దగ్గర వున్నది ఎంత అందమైనది అయినా .... ఆనందాన్ని కలిగించేది అయినా .....
 దూరంగా కనిపించే దానికోసం అర్రులు చాచే  గుణం కలిగిన ఏకైక జీవి ........

మనిషి మనసుకి బానిస ...
మనసుకి  మత్తు నిషా 
 మనసుకి , దాని కనుసన్నల్లో నడిచే మనిషికి నిత్యం ఒక సంఘర్షణ .....
 గెలుపోటములు ఎవరివైనా...... చివరికి గేలిచెయ్యబడేది  మనిషే....  

                                                                                 -Kurella Swamy

Tuesday 24 April 2012

మహాత్మా జ్యోతిరావు పూలే

మనువాదం సృష్టిస్తున్న అగాధాలను పూడ్చి ,
మానవీయ విలువలను మరుగున పడకుండా కాపాడి,
ఈ దేశ మానవాళికి దిశానిర్దేశం చేసి ,
భయపడుతూ  బ్రతికిన  ,  ఏ నేరం చేయకున్నా శిక్ష అనుభవించిన అమాయకులను చైతన్యపరచి, 
మనిషిని ఆలోచింపజేసే చదువును అందరకి సమానంగా అందించి, 
స్త్రీ విద్యకు ఆధ్యుడవై ప్రోత్సహించి , తొలిగా నీ  ఇంటినుంచే ప్రారంభించి ,
చదువుల తల్లి సావిత్రిభాయి తోడుగా ఎన్నో జీవితాలను సంస్కరించి 
వాడిపోతున్న పూలంటి ఎంతో మంది గొంతుకగా మారి  వారి శ్రేయస్సు కొరకు విశ్రమించక పోరాడిన అభ్యుదయవాది , మానవతావాది    మహాత్మా పూలే ...
ఓ సమసమాజ స్వాప్నికుల   ఆరాధ్యమా .. అందుకో నీకివే మా తీరొక్క పూల జోహార్లు.... 
("మహాత్మా జ్యోతిరావు పూలే  జయంతి సందర్బంగా ")
                                                                               - Kurella Swamy

శివ సాగర్






మండే సూర్యుడు మాట్లాడుతున్నాడు 



ఎండిన  చెట్లు పాటలు పాడుతున్నాయి 

మూగబోయిన కోకిల మౌనంగానే విలపిస్తుంది 

అలుపెరుగని అమరవీరునికి జోహార్లు తెలుపుతున్నాయి 

చెమర్చిన కళ్ళు ఎందుకొరకో  వేచిచుస్తున్నాయి 

ఏడ్చిన గుండె ఎవరికోసమో  వెదుకుతూ ఎదురుచూస్తుంది 

పూడ్చబడిన   మనిషికి పునర్జన్మ  ఇవ్వాలని ప్రకృతిని  కోరుతున్నట్లున్నాయి 

(శివ సాగర్ కు జోహర్లతో .......)

                                                                 -Kurella Swamy

భారతరత్న డాక్టర్ బి. ఆర్ . అంబేడ్కర్

చుట్టూ చీకట్లు కమ్ముకున్నాయి , దారి కనబడక దశ దిశలు తిరుగుతూ 
ఈ  దేశ మూలవాసులు , వెలుతురు కోసం ఎదురుచూస్తున్నారు ,
కాలం మా మీద  జాలి చూపి , మమ్మల్ని నడిసంద్రం నుంచి తీరం చేర్చే 
ఒక నావికుడిని, భావి తరాలకు భవిష్యత్తును కల్పించే  మహోన్నతుడిని  మా చెంతకు పంపింది .

మెతుకుల  కొరకు శోకిస్తూ వెతికే మా చేతులకు ,
గీతలు మార్చే రాతలు నేర్పి, రాజ్యాలేలే యోగ్యతనిచ్చావు, 
చితికిపోతున్న మా జీవితాలకు  అంతులేని పోరాటాల అధ్యయనం అలవాటు చేసి ,
 ఆత్మాభిమాన ధనాన్ని మాకంధించడానికి  క్రొవ్వొత్తిలా నీవు కరిగావు.

"సనాతన సంప్రదాయాల చట్రంలో బందీలై  
ఎందుకు ఏమి చేస్తున్నామో తెలియని సుప్తావస్తలోని 
విస్తీర్ణమైన  మా మస్తిష్కాలలో విజ్ఞానపు ఆస్తుల్ని పెంచే 
బృహత్తర ఆశయాన్ని భుజాలకెత్తుకుని 
భూమిని నమ్మిన మట్టిమనుషులకు , ఆకాశపు ఎత్తులు అందుకునే అవకాశం కల్పించావు "

నిరంతర విద్యాధన సంపాదనలో జగమెరిగిన వారిలో అగ్రగణ్యుడవై 
జాతి గర్వించే రత్నమై ,దేశ ప్రతిష్టను పెంచావు ,
"భోధించు .... సమీకరించు .....పోరాడు " అనే నినాదమిచ్చి, 
మా బ్రతుకుల నడిపించే మార్గ దర్శకుడవయ్యావు.  

రాజ్యాంగ రచయితవు , నవభారత నిర్మాతావు , రాజీలేని పోరాటాలు జరిపి విజయాలందుకున్నావు.....
ప్రపంచ   మేధావివి   , అత్మాభిమాన అభిమానివి , ఆదర్శప్రాయుడవు , మాకు అస్తిత్వాన్ని కల్పించి  ధైర్యన్నిచ్చావు .


నీవే లేకపోతే నేనిక్కడుందునా..... నేనోక్కడినేనా ... నా లాంటి ఎందరో, మరెందరో  లెక్కేలేదు ...
గుర్తించలేని  గుడ్డి శక్తులు నీ విగ్రహాలపై బౌతికంగా దాడి చేసినా ...
మా మనసుల్లోని నీ ఆశయాన్ని , నీ ఆలోచనలని వేరు చేయడం ఎవరి వల్ల కాదు ....
అందుకో పాదాభివందనం అంభేద్కరా .......నీ ఆశయాన్ని  అతిత్వరలోనే నేరవేరుస్తాం  అని బాసతో .......
 ("భారతరత్న డాక్టర్ బి. ఆర్ . అంబేడ్కర్ జయంతి సందర్భంగా" )
 
                                                                                                    - Kurella Swamy

సమాజం

నిద్ర నన్ను ఒంటరిని చేసి ప్రపంచాన్ని చీకటిలో చూడమని ఆదేశించింది... శాంతిని వెదుక్కుంటూ నిశీధిలో నడచి నడచి నిజాలు ఎన్నో తెలుసుకున్నా....
పగలు చూసే ప్రపంచం అంతా ప్రకృతి సహజం కాదని ,రాత్రి జరిగే రాజకీయాలు , రాజీ లేని పోరాటాలు ఉదయాన్ని శాసిస్తాయని .....


ఆశలు తీర్చుకోవడానికి కొందరు మనుషులు ఎదుటివారి ఆశయాలను కూడా ఖాతరు చెయ్యరని .....
అధికారం చేజిక్కించుకోవడం కోసం , ఎందరో అభిమానించే మహానుభావులను , వారి సిద్ధాంతాలను పాటించే వారి మనోబావాలను కించపరిచే చర్యలకు పాల్పడతారని ,

ప్రతి సంధర్బంలో స్పందించే సమసమాజస్థాపక సంఘాలు , ఈ సమయం లో మహోన్నతులను కొన్ని వర్గాలకు పరిమితం చేస్తాయని ......
సరే ఈ సంఘాల స్వభావం ఇంతే అని అనుకునేలోపు , ఎవరి వల్లనైతే తమ జీవితాలు ఒక స్థాయికి వచ్చాయో , ఆ వ్యక్తులకు జరగకూడనివి జరిగితే ఖండించలేని మేధావి వర్గాలు కూడా ఉంటాయని...
కన్నీళ్ళు తాగుతూ , జాతి సంపదను పెంచడానికి శ్రామిక వర్గాలు తమ జీవితాంతం అలుపెరుగక కృషి చేస్తాయని ,
ఏ మూలో ఒక అరుగుపై , కాళ్ళు ముడుచుకొని , కటిక చీకటిలో , కురిసే మంచులో , చలికి గజగజ వణుకుతున్న ఆ పసివాడు చేసిన పాపం ఏమిటనే ప్రశ్నలు సమాధానం సాధ్యం కానివేమి కావు అని,
నేను పేదవానిగా ఎందుకు పుట్టాననే ప్రశ్న , నేను ఒంటరిని ఎందుకు అయ్యాననే ఆలోచన వారికి వచ్చినప్పుడు సమాజంలో వచ్చే విప్లవాన్ని ఏ ధనిక ,పెట్టుబడిదారి వర్గాలు ఆపలేవని ......
సమసమాజ స్థాపన కోసం మేధావులు , రాజ్యాంగ నిర్మాతలు అందించిన అవకాశాలను , అజ్ఞానంతో అర్ధం చేసుకోలేని విజ్ఞానవంతులు ఉంటారని ......
ఎవరో ఒకరు అవకాశాలు కోల్పోతున్నారని , కొన్ని కోట్ల కుటుంబాల గురించి ఆలోచన చేయలేని అవకాశవాదులు అర్ధరహిత వాదనలు చేస్తారని .......
జాతి అభివృద్ధి కోరుకునే వారు , అందులో భాగమైన బడుగుల భవిష్యత్తు గురించి ఆలోచించకపోవడం వెనక దాగిన రహస్యాలు వుహాతీతమేమి కావనీ....
మనిషి మనుగడకు కారణమైన అనేక వనరులు ప్రస్తుతం కొద్దిమంది అధీనం లో వున్నాయని .......
నిత్యం సత్యం మాట్లాడే వ్యక్తులు చాలా అరుదుగా కనిపిస్తారని
మంచిని వెదుకుతూ, వంచనకు గురయ్యి , బలయ్యి మోడుబారిన జీవితాలు ఎన్నో లేక్కేలేదని ....
కత్తిని చూసి మెత్తగా మాట్లాడేవారు , ఆయుధం లేకుండా అడుగు బయట పెట్టలేని వారు , పదవి కోసం శవాలపై ప్రమాణాలు చేసేవారు, పదిమందిని ముంచినా సరే మనం మంచిగా వుండాలి అనుకునేవారు చీకటిలో చాలా ఒప్పందాలు చేసుకుంటారని .....
మనుషులను మతాలుగా.. మతాలను శత్రువులుగా ..
కులాన్ని కుట్రలకు అనుకూలంగా .... కుట్రలన్నీ కురుక్షేత్రం అయ్యేలాగా ......
ఆత్మీయుల మధ్య అంతరాలు పెంచే అభివృద్ధి జపమాంత్రికులు , అనుక్షణం కుతంత్రాల భవంతిలో స్థానం కోసం బహిరంగంగానే దూషించుకుంటారని..... సమాజం నన్ను హెచ్చరించింది....... సంఘంలోని అసమానతలని అర్ధం చేసుకొని, నిర్మూలించడానికి ప్రయత్నించమంది......


                                                                                               -Kurella Swamy

నేనెందుకు చావాలి ...?

అవునూ ......... నేనెందుకు చావాలి ...?

నేను యువకుడను ,
ఉడుకు రక్తం ప్రవహిస్తున్నవాడను ,
కాలానికి ఎదురునిలిచే సత్తువ కలవాడను ,
వలలను వదిలించుకునే విద్యను నేర్చుకున్నవాడను ,
కలలెలా నిజం చేసుకోవాల్లో తెలిసినవాడను ,
కళలను ఎలా ఆరాధించాలో అర్ధం అయినవాడను ,

అన్యాయాలనెలా ఎదిరించాలో అవగతం చేసుకున్నవాడను ,
ఆకాశానికి నిచ్చెన వేయడం అలవాటైనవాడను ,
ఆనందాలను అందుకోవడమేలాగో ఆలోచిస్తున్నవాడను ,
నేస్తాల స్నేహలలో అనుక్షణం మైమరచిపోతున్నవాడను ,
కన్నవాళ్ళ కన్నీళ్ళ ఆశల భారాలను మోస్తున్నవాడను ,

తోడబుట్టిన వారి ఆప్యాయాతానురాగాలలో అనునిత్యం అపురూప గాజుబోమ్మగా బ్రతుకుతున్నవాడను ,
కపట రాజకీయ నాయకుల కుతంత్రాల కుట్రల మధ్య నలిగి వాడిపోకూడని పువ్వును....
కన్నోల్లకు కడుపు తీపి మిగల్చక ,కడవరకు వారికి చేదోడు వాదోడుగా మెలగాల్సిన వాడను ,
కలలు నేరవేరినపుడు కళ్ళార వీక్షించి , వినీలాకాశాన విహంగమై విహరించాల్సినవాడను

నిజమే ..... నేనెందుకు చావాలి ...
నాతో అనుబంధం వున్న ఇంతమంది ఆనందాన్ని నేనెందుకు దూరం చెయ్యాలి ....
నా శక్తి ఒక గొప్ప ఆశయ సాధనకి ఉపయోగపడకుండా నేనెందుకు నిష్క్రమించాలి....

నేను బ్రతకాలి..... బ్రతికి సాధించాలి
విభిన్న వ్యక్తిత్వాల నాలుగున్నరకోట్ల మిశ్రమం విశ్రమించక పోరాడుతున్న మహోద్యమంలో అంతిమ విజయం ఆస్వాదించే క్షణాన్ని చూడటానికి అయినా నేను బ్రతికుండాలి.....
( తెలంగాణ ఉద్యమంలో పువ్వుల్లా రాలిపోతున్న నా తెలంగాణ సహోదరులకు కన్నీటి విడ్కోలుతో....... ఇకపై మరెవరు కఠిన నిర్ణయాలు తిసుకోవద్దనే విజ్ఞాపనతో... ) 
                                                                                                 - Kurella Swamy